JD: 'జేడీ' లక్ష్మీనారాయణ కెరీర్ లో తొలి కేసు ఇదే!
- కొండముచ్చు కోతిపై మహిళల ఫిర్యాదు
- ఆడవాళ్లు కనిపిస్తే చాలు అసభ్యంగా ప్రవర్తిస్తున్న కోతి
- విజయవంతంగా కేసు డీల్ చేసిన లక్ష్మీనారాయణ
సీబీఐలో జాయింట్ డైరక్టర్ గా వీవీ లక్ష్మీనారాయణ ఎంత పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఐపీఎస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేశారు. జేడీ లక్ష్మీనారాయణ అంటే ప్రతి ఒక్కరూ గుర్తించే విధంగా పాప్యులర్ అయ్యారు. ఆయన ఇటీవలే జనసేన పార్టీలో చేరి విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
తన కెరీర్ లో మొదటగా టేకప్ చేసిన కేసు గురించి చెప్పి నవ్వులు పూయించారు. పోలీస్ ట్రయినింగ్ అకాడమీలో ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తయ్యాక ప్రొబేషనరీ ఆఫీసర్ గా మహారాష్ట్రలోని యవట్ మాల్ లో తొలి పోస్టింగ్ అందుకున్నారు. అక్కడికి వెళ్లగానే, తొలిరోజే వందమంది ఆడవాళ్లు వచ్చి ఓ కొండముచ్చు కోతిపై ఫిర్యాదు చేశారు. కొండముచ్చు వీళ్లనేం చేస్తుంది? అని ఆశ్చర్యపోయిన లక్ష్మీనారాయణ అదే విషయం వాళ్లను అడిగారు.
తాము వెళుతుంటే ఆ కొండముచ్చు తమతో అసభ్యంగా ప్రవర్తిస్తోందని వాళ్లు వివరించారు. దాంతో ఆయన ఓ కానిస్టేబుల్ కు చీరకట్టించి అమ్మాయిలా అలంకరించి ఆ కొండముచ్చు ఉన్న ఏరియాకు పంపారు. కానీ, ఆ కొండముచ్చు ఎంతో తెలివైనది. ఆ కానిస్టేబుల్ మగవాడని వెంటనే గుర్తించి అతని జోలికి వెళ్లలేదు. ఆ వెంటనే మరో మహిళను పంపగానే యథాప్రకారం ఆమె దాడికి దిగింది.
దాంతో, అటవీశాఖ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని మత్తు కలిగించే ఇంజెక్షన్లను తుపాకీలో లోడ్ చేసి ఆ కొండముచ్చును గురిచూసి కాల్చారు. ఆ ట్రాంక్విలైజర్ నేరుగా కొండముచ్చును తాకింది. దాంతో ఆ కొండముచ్చు మత్తులో పడిపోగా, లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలోని పోలీసులు దాన్నిబంధించి, అటవీశాఖ సిబ్బందికి అప్పగించారు. ఆ విధంగా తన తొలి కేసును విజయవంతంగా డీల్ చేసినట్టు లక్ష్మీనారాయణ ఇంటర్వ్యూలో వివరించారు.