India: ప్రపంచకప్‌లో పాక్‌పై కొనసాగిన భారత జైత్ర యాత్ర.. ఏడోసారీ మనదే విజయం
- పాకిస్థాన్‌పై 89 పరుగుల భారీ తేడాతో గెలిచిన కోహ్లీ సేన
- ఆటను కొనసాగించేందుకు సహకరించిన వరుణుడు
- ఏకపక్షంగా సాగిన మ్యాచ్
ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఓటమెరుగని భారత జట్టు మరోమారు సత్తా చాటింది. గత రికార్డును పదిలపరుచుకుంది. ఆదివారం మాంచెస్టర్ వేదికగా జరిగిన హైవోల్టేజ్ పోరులో పాక్‌కు మరోమారు భంగపాటు ఎదురైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి భారత రికార్డుకు అడ్డుకట్ట వేయాలని భావించిన సర్ఫరాజ్ సేనకు మళ్లీ నిరాశ ఎదురైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. రోహిత్ అద్భుత సెంచరీకి తోడు శిఖర్ ధవన్ స్థానంలో జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్ సమయోచిత ఇన్నింగ్స్, కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ వెరసి భారత్ భారీ స్కోరు చేసింది. భారీ విజయ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పాక్ మొదట్లో కాస్త భయపెట్టినా తర్వాత తోక ముడిచింది. భారత బౌలర్ల విజృంభణతో టపటపా వికెట్లు కోల్పోయి 89 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
13 పరుగుల వద్ద ఇమాముల్ హక్ (7) రూపంలో పాక్ తొలి వికెట్ కోల్పోయింది. ఐదో ఓవర్ నాలుగో బంతికి మోకాలి గాయం కారణంగా భువనేశ్వర్ ఓవర్ మధ్యలో మైదానాన్ని వీడాడు. అతడు వేయాల్సిన రెండు బంతులను వేసే బాధ్యతను తీసుకున్న విజయ్ శంకర్ వేసిన తొలి బంతికే హక్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజంతో కలిసి ఓపెనర్ ఫఖార్ జమాన్ కాసేపు భారత్ శిబిరంలో ఆందోళన నింపాడు. క్రీజులో కుదురుకున్నాక ఇద్దరూ యథేచ్ఛగా షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో 23 ఓవర్లకు 113/1తో పటిష్ట స్థితిలోకి వెళ్లింది.
అయితే, 24వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. అద్భుత బంతితో బాబర్ ఆజం(48)ను బౌల్డ్ చేయడంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. తన తర్వాతి ఓవర్లో ప్రమాదకర ఆటగాడు ఫఖార్ జమాన్ (62)ను కూడా వెనక్కి పంపాడు. ఆ తర్వాత పాండ్యా వరుస బంతుల్లో హఫీజ్ (9), షోయబ్ మాలిక్(0)లను పెవిలియన్ పంపడంతో పాక్ ఓటమి కోరల్లో చిక్కుకుంది. ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ సర్ఫరాజ్ కూడా (12) చేతులెత్తేశాడు. ఈ క్రమంలో 35 ఓవర్లలో 166/6తో పరాజయానికి పాక్ దగ్గరగా ఉన్నవేళ వర్షం మొదలైంది. దాదాపు గంటకుపై మ్యాచ్ నిలిచిపోవడంతో ఆటను కుదించారు. పాక్ విజయ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302 పరుగులుగా నిర్ణయించారు. వర్షం తగ్గాక తిరిగి బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ ఐదు ఓవర్లలో 136 పరుగులు చేయాల్సి ఉండగా కేవలం 46 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆరంభం నుంచే అదరగొట్టింది. లోకేశ్ రాహుల్-రోహిత్ శర్మ జోడి తొలి వికెట్‌కు 136 పరుగులు జోడించింది. 57 పరుగులు చేసిన రాహుల్ రియాద్ బౌలింగ్‌లో బాబర్ ఆజంకు దొరికిపోయాడు. అయితే, మరోవైపు క్రీజులో పాతుకుపోయిన రోహిత్ 85 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్‌కు ఈ ప్రపంచకప్‌లో ఇది రెండో సెంచరీ. అదే జోరుతో బ్యాట్‌ను ఝళిపించిన రోహిత్ 140 పరుగులు చేసి హసన్ అలీ బౌలింగ్‌లో రియాజ్‌కు దొరికిపోయాడు.
77 పరుగులు చేసిన కోహ్లీ అవుట్ కాకుండానే అవుటని భావించి మైదానాన్ని వీడాడు. చివర్లో పాండ్య 26, విజయ్ శంకర్ 15 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. సెంచరీతో భారత జట్టును గెలిపించిన రోహిత్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో భారత్ 7 పాయింట్లో మూడో స్థానానికి చేరుకుంది.