Kolkata: గంగానదిలో ఒళ్లు గగుర్పొడిచే విన్యాసం.. కనిపించకుండా పోయిన జాదుగర్ మంద్‌రాకే
- చేతులకు సంకెళ్లతో గ్లాస్ బాక్స్‌లో జాదుగర్ మంద్‌రాకే
- బయటకు రాలేకపోయిన మంద్‌రాకే
- కుటుంబ సభ్యులు, పోలీసులు, వందలాదిమంది చూస్తుండగానే విషాదం
జాదుగర్ మంద్రాకేగా ప్రసిద్ధి పొంది చంచల్ లాహిరి(40) చేసిన మ్యాజిక్ విన్యాసం వికటించింది. పోలీసులు, మీడియా, కుటుంబ సభ్యులు, వందలాదిమంది చూస్తుండగానే ఆయన అదృశ్యమయ్యారు. ఇప్పుడాయన కోసం పోలీసులు గంగానదిలో గాలిస్తున్నారు. కోల్‌కతాలోని హౌరాబ్రిడ్జి వద్ద జరిగిన ఈ ఘటన సంచలనమైంది. కాళ్లు చేతులను తాళ్లతో బంధించిన లాహిరిని ఓ గ్లాస్ బాక్స్‌లో పెట్టి తాళం వేశారు. అనంతరం దానిని గంగానదిలో విడిచిపెట్టారు.
లాహిరి ఆ సంకెళ్లు తెంచుకుని బాక్స్ తెరుచుని బయటకు రావాలి. ఇదీ విన్యాసం. అయితే, అలా దిగిన లాహిరి ఎంతకూ బయటకు రాకపోవడంతో పోలీసులు ఆయన కోసం గాలింపు మొదలుపెట్టారు. అయినప్పటికీ ఆయన జాడ కానరాలేదు. ఈ విన్యాసానికి ముందు లాహిరి మాట్లాడుతూ.. తాను 21 ఏళ్ల క్రితం ఇదే ప్రదేశంలో ఇదే విన్యాసాన్ని విజయవంతంగా చేశానని చెప్పుకొచ్చారు. అప్పట్లో 21 సెకన్లలోనే బయటకు వచ్చేశానని వివరించారు. ఈసారి బయటకు రావడం కష్టమేనని, వస్తే మ్యాజిక్ అవుతుందని, లేదంటే ట్రాజిక్ అవుతుందని వ్యాఖ్యానించారు. అయితే, ఆయన చెప్పినట్టుగానే ఈ మ్యాజిక్ కాస్తా విషాదాంతంగా ముగిసింది.