Andhra Pradesh: రెండు వేళ్లు చూపించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజలకు మూడు పంగనామాలు పెట్టి వెళ్లిపోయాడు!: కాకాణి గోవర్ధన్ రెడ్డి
- గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం
- ఓటుకు నోటు కేసులో బాబు అడ్డంగా దొరికారు
- వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ లో స్థానం కల్పించారని తెలిపారు. ప్రజలు పూర్తి విశ్వాసం, నమ్మకంతో జగన్ ను ఏపీ ప్రజలు ఆశీర్వదించారని చెప్పారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదాపై చాలాసార్లు యూటర్నులు తీసుకున్నారని దుయ్యబట్టారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని కాకాణి విమర్శించారు. తన స్వార్థం కోసం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చంద్రబాబు.. ఏపీని అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలను టీడీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పెంచేసిందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు కనీసం రేషన్ సరుకులు కూడా ఇవ్వలేకపోయిందనీ, జన్మభూమి కమిటీలు అడ్డగోలుగా దోచుకున్నాయని ఆరోపించారు.
‘2014 ఎన్నికల సమయంలో ఏ టీవీ చూసినా బ్యాంకులవాళ్లు ఇంటికి జప్తు చేయడానికి వచ్చినట్లు, అందులోని ఇల్లాలు.. ఇంకో రెండు వారాలు ఆగండి.. ఆయన వస్తాడు అని చెప్పడం. ఎవరని చూస్తే చంద్రబాబు సైకిల్ పై రెండు వేళ్లు చూపిస్తూ రావడం. ఇదే నడిచింది. ప్రజలకు రెండు వేళ్లు చూపించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజలకు మూడు పంగనామాలు పెట్టి వెళ్లిపోయారు’ అని విమర్శించారు.