Ambati Rambabu: చంద్రబాబు నూటికి వెయ్యి శాతం అంటుంటే అప్పుడు భయం వేసింది: అంబటి రాంబాబు
- చంద్రబాబు అంచనాకు అందని విజయాన్ని ప్రజలు ఇచ్చారు
- విజయగర్వం చూపించబోము
- ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన అంబటి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత, తిరిగి అధికారంలోకి వచ్చేది తామేనని, ఈ విషయాన్ని తాను నూటికి వెయ్యి శాతం చెబుతున్నానని చంద్రబాబునాయుడు మాట్లాడుతుంటే, తనకు కొద్దిగా భయం వేసిందని సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాంబాబు మాట్లాడుతూ, ప్రజలు మాత్రం మరో విధంగా తీర్పిచ్చారని అన్నారు. తాము 151 మందిమి ఉంటే, మీరు 23 మందే ఉన్నారని, చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడు, చక్రాలు గిరగిరా తిప్పిన నాయకుడి అంచనాకు కూడా అందని విజయాన్ని తమకు ప్రజలు అందించారని అన్నారు.
తామేమీ విజయగర్వంతో లేమని, జాగరూకతతోనే వ్యవహరిస్తామని అన్నారు. అమ్మాయి సంసారం చేసే కళ కాళ్లగోళ్లను చూస్తేనే తేలిపోతుందన్న సామెతను గుర్తు చేసిన ఆయన, చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వేళ, ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని, కానీ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. మీరనుకుంటే సమర్థవంతమైన పాలన అందించినట్టు కాదని, ఆ మాటను ప్రజలు అనుకోవాలని చురకలు అంటించారు. విపక్షం నుంచి సద్విమర్శలు చేస్తే స్వాగతిస్తామని, అంతు చూస్తామంటూ మాట్లాడితే మాత్రం ఊరుకోబోయేది లేదని హెచ్చరించారు.