Andhra Pradesh: గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం కేసీఆర్.. స్వాగతం పలికిన ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, వెల్లంపల్లి!
- ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం
- జగన్ నివాసానికి వెళ్లనున్న తెలంగాణ సీఎం
- ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఈ నెల 21న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఆహ్వానించే క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
దీంతో ఎయిర్ పోర్టుకు చేరుకున్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి కేసీఆర్ కు ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్,ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, లోక్ సభ మాజీ సభ్యుడు వినోద్ తదితరులు వున్నారు. అక్కడి నుంచి నేరుగా కేసీఆర్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు బయలుదేరారు.
అమ్మవారిని మధ్యాహ్నం 1.45కు కేసీఆర్ దర్శించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు కేసీఆర్ ఏపీ సీఎం జగన్ తో భేటీ అవుతారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను కేసీఆర్ ఇప్పటికే ఆహ్వానించారు.