Jagan: దళితులంతా కంకణం కట్టుకుని జగన్ ను సీఎం చేశారు... కానీ జగన్ ఏం చేశారు?: హర్షకుమార్
- జగన్ పనితీరు చేతల్లో కనిపించడంలేదు
- దళితుడి హత్యకేసులో వైసీపీ ప్రభుత్వం తీరు బాధాకరం
- బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత జగన్ సర్కారుపైనే ఉంది
అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ జగన్ సర్కారుపై ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ రాష్ట్రంలోని దళితులంతా కంకణం కట్టుకుని మరీ జగన్ ను గెలిపించారని, కానీ జగన్ సర్కారు దళితుల పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జగన్ చెబుతున్న మాటలకు, ఆయన చేతలకు పొంతనలేదని అన్నారు. జగన్ పనితీరు చేతల్లో కనిపించడం లేదంటూ హర్షకుమార్ విమర్శించారు.
ఇటీవల ఓ దళితుడ్ని పంచాయతీ కార్యాలయంలో హత్యచేశారని ఆరోపించిన ఈ మాజీ ఎంపీ, సదరు కేసులో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. మామిడికాయలు కోశాడంటూ రంగంపేట మండలం సింగంపల్లిలో దళితుడిని కొట్టి పంచాయతీ కార్యాలయంలోనే ఉరితీశారని హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు 14 రోజుల్లోనే బెయిల్ లభించడం, బాధితుడి కుటుంబాన్ని ఇప్పటివరకు మంత్రులు గానీ, జిల్లాస్థాయి అధికారులు కానీ పరామర్శించకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత జగన్ సర్కారుపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు.