shakib: బంగ్లాదేశ్ మరో సంచలనం.. చిత్తుగా ఓడిన విండీస్
- 322 పరుగుల విజయ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన బంగ్లాదేశ్
- సెంచరీతో చెలరేగిన షకీబల్ హసన్
- మూసుకుపోయిన విండీస్ సెమీఫైనల్ ఆశలు
ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ మరోమారు సంచలన విజయాన్ని అందుకుంది. ఈ నెల 2న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న బంగ్లాదేశ్.. నిన్న విండీస్‌ను చిత్తుగా ఓడించింది. కరీబియన్లు నిర్దేశించిన 322 పరుగుల విజయ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఫలితంగా 5 పాయింట్లతో జాబితాలో పైకి ఎగబాకింది. ఇక వరుస పరాజయాలతో సతమతమవుతున్న విండీస్‌కు సెమీఫైనల్ ఆశలు సన్నగిల్లాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ ఓపెనర్ క్రిస్‌గేల్, సిక్సర్ల వీరుడు ఆండ్రూ రస్సెల్ డకౌట్ అయినా టాపార్డర్ పుంజుకోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ఎవిన్ లూయిస్ 70, షాయ్ హోప్ 96, నికోలస్ పూరన్25, మెట్మెయిర్ 50, జాసన్ హోల్డర్ 33 పరుగులు చేయడంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగుల భారీ స్కోరు చేసింది.
అనంతరం 322 పరుగుల విజయ లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన బంగ్లాదేశ్ ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను ధాటిగానే ప్రారంభించారు. తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 29 పరుగులు చేసిన ఓపెనర్ సౌమ్య సర్కార్‌ను రస్సెల్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షకీబల్ హసన్ చెలరేగిపోయాడు. ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 48 పరుగులు చేసిన తమీమ్ ఇక్బాల్ రనౌటై వెనుదిరిగాడు. ఆ తర్వాత ముష్ఫికర్ రహీం ఒక్క పరుగుకే వెనుదిరగడంతో విండీస్ శిబిరంలో ఆశలు చిగురించాయి. అయితే, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు.
పసలేని విండీస్ బౌలర్లు వికెట్ల కోసం చెమటోడ్చినా ఫలితం లేకుండా పోయింది. షకీబల్ హసన్, లిటన్ దాస్‌లు క్రీజులో పాతుకుపోయి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. షకీబల్ అజేయంగా 124 పరుగులు చేయగా, లిటన్ దాస్ సెంచరీకి 4 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 322 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 41.3 ఓవర్లలోనే ఛేదించిన బంగ్లాదేశ్ విండీస్‌పై ఘన విజయాన్ని అందుకుంది. సెంచరీతో జట్టును గెలిపించిన షకీబల్ హసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.