Monsoon: ఏపీకి చల్లని కబురు.. నేటి నుంచి వర్షాలు!
- నేడు రాష్ట్రంలోకి రుతుపవనాలు
- మూడు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరణ
- వర్షాలు పడే ప్రాంతాల్లో బలమైన గాలులు
వాతావరణ శాఖ ఏపీకి శుభవార్త చెప్పింది. నేటి నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రుతుపవనాలు నేడు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని, ఆపై మూడు రోజుల్లోనే రాష్ట్రమంతా విస్తరిస్తాయని తెలిపింది. నిజానికి ఈ నెల మొదటి వారంలోనే వర్షాలు కురవాల్సి ఉన్నా.. రుతుపవనాలు కేరళను 15 రోజులు ఆలస్యంగా తాకడంతో వానలు కురవడం ఆలస్యమైందన్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల వాయువు మరింత బలపడుతోందని, దీనివల్ల మబ్బులు ఏర్పడి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, వానలు పడే సమయంలో గాలులు భారీగా వీస్తాయని పేర్కొన్నారు.