Telangana: బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై కోమటిరెడ్డి స్పందన ఇదీ..
- తనను పీసీసీ చీఫ్‌ను చేసి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదు
- సోదరుడి ప్రమాణ స్వీకారం కోసమే ఢిల్లీకి
- నియోజకవర్గ ప్రజలను సంప్రదించాకే నిర్ణయం
గత నాలుగైదు రోజులుగా తెలంగాణలో చర్చ అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపైనే. ఆయన త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని, ఈ మేరకు సర్వం సిద్ధమైందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రెండు రోజుల క్రితం బీజేపీపై ప్రశంసలు కురిపించిన ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ అధిష్ఠానానికి టీపీసీసీ లేఖ కూడా రాసింది.
తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై రాజగోపాల్‌రెడ్డి స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు. అయితే, తన నియోజకవర్గంలోని ప్రజలను, కార్యకర్తలను, అనుచరులను సంప్రదించాకే ఏ నిర్ణయమైనా తీసుకుంటానని స్పష్టం చేశారు. తన సోదరుడు వెంకట్‌రెడ్డి ప్రమాణ స్వీకారం కోసమే ఢిల్లీ వచ్చానని, అంతే తప్ప మరేమీ లేదన్నారు. తనకు పీసీసీ పదవి ఇచ్చి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్‌కు ఈ దుర్గతి ఉండేది కాదన్నారు.