Chennai: చెన్నైలో 'బస్ డే'... 30 మంది విద్యార్థులకు త్రుటిలో తప్పిన పెనుముప్పు... వీడియో!
- చెన్నైలో 'బస్ డే' జరుపుకున్న విద్యార్థులు
- పైకి ఎక్కి సందడి చేస్తూ కాలేజీకి
- బ్రేక్ వేయడంతో కిందపడ్డ 30 మంది
తమిళనాడులో, ముఖ్యంగా చెన్నైలో వేసవి సెలవుల అనంతరం కాలేజీలను తిరిగి తెరిచే రోజున విద్యార్థులు, 'బస్ డే' పేరిట సిటీ బస్ లపైకి ఎక్కి అల్లరి చేస్తూ, ప్రయాణించి కాలేజీలకు చేరుకుంటారన్న సంగతి తెలిసిందే. గతంలో ఇదో పెద్ద వ్యసనమై, యాక్సిడెంట్లలో విద్యార్థులు మరణించగా, బస్ డేపై నిషేధాన్ని కూడా విధించింది. అయినా విద్యార్థులు తొలి రోజున బస్సులపైనే ప్రయాణిస్తుంటారు.
తాజాగా చెన్నై రూట్ నంబర్ 47ఏలో ప్రయాణిస్తున్న ఓ బస్ పైకి 50 మంది వరకూ విద్యార్థులు ఎక్కి అల్లరల్లరి చేస్తున్న వేళ, డ్రైవర్ బ్రేక్ వేయడంతో పైనున్న దాదాపు 30 మంది ఒక్కసారిగా కిందపడిపోయారు. ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టకుండా ఉండే క్రమంలో డ్రైవర్ బ్రేక్ వేసినట్టు ఈ వీడియోను చూస్తుంటే తెలుస్తోంది.
బస్ ముందు వెళుతున్న ఓ వాహనదారు వీరి అల్లరిని వీడియో తీయడంతో బస్సు ప్రమాదం దృశ్యాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. బస్సు చాలా నెమ్మదిగా వెళుతుండటంతో విద్యార్థులకు చిన్న చిన్నగాయాలు మినహా మరే ప్రమాదమూ జరగలేదు. బస్ ఏ మాత్రం వేగంగా ఉన్నా, పెను ప్రమాదమే జరిగి, ముందు చక్రాల కింద కనీసం 10 మంది పడిపోయివుండేవారు.