special status: టీడీపీ వల్లే ప్రత్యేక హోదా రాలేదు: జగన్
- విభజన నష్టాలను హోదాతోనే పూడ్చుకోవచ్చు
- పరిశ్రమలు, ఉద్యోగాలు రావాలంటే హోదా అవసరం
- ప్రణాళిక సంఘంతో టీడీపీ ప్రభుత్వం మాట్లాడలేదు
గత ఐదేళ్లలో రాష్ట్రానికి రూ. 66,300 కోట్ల రెవెన్యూ లోటు ఉందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉపాధి కల్పన సామర్థ్యం తగ్గిపోయిందని... ఉద్యోగాల కోసం యువత ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని తెలిపారు.
కేవలం ప్రత్యేక హోదా ద్వారానే విభజన నష్టాలను పూడ్చుకోవచ్చని చెప్పారు. పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా ప్రత్యేక హోదానే అవసరమని అన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసు పేరుతో ప్రత్యేక హోదాను ఇవ్వడం లేదని చెప్పారు. ప్రణాళికసంఘంతో గత టీడీపీ ప్రభుత్వం మాట్లాడకపోవడం వల్లే హోదా రాలేదని ఆరోపించారు. విభజనతో నష్టపోయినదాన్ని ప్రత్యేక హోదాతో భర్తీ చేస్తామని పార్లమెంటు సాక్షిగా అప్పట్లో హామీ ఇచ్చారని అన్నారు. ఒక్క విభజన హామీని కూడా నెరవేర్చలేదని చెప్పారు.