Andhra Pradesh: ఏపీ పోలీసులకు శుభవార్త... రేపటి నుంచి వీక్లీ ఆఫ్ అమలు
- ఇప్పటికే ప్రయోగాత్మకంగా విశాఖ, కడప జిల్లాల్లో అమలు
- వీక్లీ ఆఫ్ పై ప్రతి నెలా ఫీడ్ బ్యాక్
- వారాంతపు సెలవుతో ఉపశమనం లభిస్తుందన్న డిపార్ట్ మెంట్
రాష్ట్రంలోని పోలీసులకు ప్రభుత్వం తియ్యని కబురు చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారాంతపు సెలవుల విధానాన్ని ప్రభుత్వం రేపటి నుంచి అమలు చేయనుంది. ఇకమీదట పోలీసులకు కూడా ప్రతివారం ఓ సెలవు ఉంటుంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు పోలీసు విభాగం కొత్తగా వీక్లీ ఆఫ్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఈ మేరకు ఏపీ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ ఉత్తర్వులు జారీచేశారు.
దీనిపై ఆయన వివరాలు తెలిపారు. కానిస్టేబుల్ నుంచి సీఐ ర్యాంకు అధికారుల వరకు వారాంతపు సెలవులు అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే విశాఖ, కడప జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వీక్లీ ఆఫ్ విధానాన్ని ప్రవేశపెట్టామని, ఇకమీదట ప్రతినెలా వారాంతపు సెలవులపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని అయ్యన్నార్ వెల్లడించారు. పని ఒత్తిడితో పోలీసులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, వారాంతపు సెలవుతో పోలీసులకు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని అన్నారు.