Hyderabad: ఫిల్మ్ నగర్ లో వ్యభిచార గృహాలు నిర్వహిస్తూ.. డ్రగ్స్ విక్రయిస్తున్న భార్యాభర్తల అరెస్టు
- నిందితులు షేక్ ఫహద్, భార్య సలీమా రబ్బాయి షేక్
- బంజారా హిల్స్ లో డ్రగ్స్ విక్రయిస్తుండగా అరెస్టు
- ఫిల్మ్ నగర్ లో వ్యభిచార గృహాల నిర్వహణ
హైదరాబాద్ లో వ్యభిచార గృహాల నిర్వహణతో పాటు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముస్లిం దంపతులను ఎన్ ఫోర్స్ మెంట్ ఎక్సైజ్ పోలీసులు ఈరోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులు షేక్ ఫహద్ అలియాస్ మదన్ (37), అతని భార్య సలీమా రబ్బాయి షేక్(27) గురించి పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు దాడి చేసి వారిని పట్టుకున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ -12 లోని సాయిబాబా గుడి వద్ద నిన్న వీళ్లిద్దరూ కారులో కూర్చుని ఓ వ్యక్తికి కొకైన్ విక్రయిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి రూ, 3 లక్షల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, స్వైపింగ్ మిషన్, రవాణాకు ఉపయోగించిన స్విప్ట్ కారుతో పాటు దాడి చేసినప్పుడు వారు పారిపోయిన మరో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ విచారణలో నిందితులు చెప్పిన వివరాలను ఎన్ ఫోర్స్ మెంట్ ఎక్సైజ్ పోలీసులు వివరించారు. ఎనిమిదేళ్ల క్రితం నెల్లూరు నుంచి హైదరాబాద్ కు షేక్ ఫహద్ వచ్చాడని, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లలో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నాడని చెప్పారు.
ఇటీవలే ఫిల్మ్ నగర్ రోడ్ నెంబర్ 5 లో రూ.75 వేలకు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో వ్యభిచార గృహం నిర్వహించడమే కాకుండా, కొంత కాలంగా డ్రగ్స్ కూడా విక్రయిస్తున్నాడని తెలిపారు. ఈ నెల 2న ఆ ఇంటిపై దాడి చేసి ఏడు గ్రాముల కొకైన్ తో పాటు మూడు గ్రాముల ఓపియం, ద్విచక్రవాహనాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. దాడి చేసిన సమయంలో ఆ ఇంట్లో ఉన్న సంతోష్, మహ్మద్ మసూద్ లను అరెస్టుచేసి విచారించగా ఈ వ్యవహారం బయటపడిందని తెలిపారు. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లలో నిందితుడు షేక్ ఫహద్ పై గత ఏడాది జనవరిలో పీడీ యాక్ట్ కింద కేసులు నమోదైన విషయాన్ని పోలీసులు తెలిపారు.