Apartments: పట్టణ పేదలకు ప్రభుత్వ అద్దె ఇళ్లు.. సకల సౌకర్యాలతో అద్దెకివ్వాలని కేంద్రం నిర్ణయం
- పట్టణాల్లో అపార్ట్మెంట్లు నిర్మించనున్న కేంద్రం
- వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్న వారికే అద్దెకు
- లబ్ధిదారుల ఎంపిక స్థానిక సంస్థలదే
ఇంటి అద్దెల భారం భరించలేని పట్టణ పేదలకు ప్రభుత్వమే సకల సౌకర్యాలతో కూడిన గదులను అద్దెకివ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ఫ్లాట్లు నిర్మించాలని కేంద్రం యోచిస్తోంది. వార్షిక వేతనం మూడు లక్షల లోపు ఉన్న వారికి వీటిని అద్దెకు ఇవ్వాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ప్రభుత్వం నిర్మించనున్న సింగిల్ రూము ఫ్లాట్లలో ఓ టాయిలెట్, నల్లా సౌకర్యం కల్పిస్తారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించనున్న ఈ అపార్ట్మెంట్లకు అయ్యే వ్యయంలో కొంత మొత్తాన్ని కేంద్ర కార్మికశాఖ, గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖలు భరించేలా ప్రభుత్వం ఒప్పించనుంది. నిర్మాణం పూర్తయ్యాక స్థానిక సంస్థల సహకారంతో లబ్ధిదారులను గుర్తించి గదులు కేటాయిస్తారు. ఆయా రాష్ట్రాల హౌసింగ్ బోర్డులు ఈ వ్యవహారాలను చూసుకుంటాయి.