New Delhi: ఢిల్లీలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. ఆసుపత్రిలో వీరంగమేసిన బంధువులు!
- ఆసుపత్రిలోకి చొరబడి దాడి చేసిన స్థానికులు
- పరుగులు తీసిన సిబ్బంది
- పోలీసుల రంగ ప్రవేశంతో అదుపులోకి
కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో వైద్యులపై రోగి బంధువులు దాడి చేసి గాయపరిచిన ఘటన మరువకముందే ఢిల్లీలో అటువంటి ఘటనే జరిగింది. ఢిల్లీలోని మహర్షి వాల్మీకి ఆసుపత్రిలో వైద్యులపై స్థానికులు దాడి చేశారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బవానా ప్రాంతంలో మంగళవారం నాలుగేళ్ల బాలికపై దాదాపు 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. దీంతో బాధిత బాలికను పరీక్షల నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడి సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగి ఆసుపత్రిలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అదే ఆసుపత్రిలో ఉన్న నిందితుడిపై దాడి చేశారు.
తమ కుమార్తెపై అత్యాచారం జరిగిందని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రిలో చేర్చారు. అయితే, అప్పటికే తొలుత శరీరం నిండా గాయాలతో బాధపడుతున్న ఓ వ్యక్తిని (నిందితుడు) ఆసుపత్రిలో చేర్చారని, ఆ తర్వాత కొంత సేపటికి అత్యాచారం జరిగిందంటూ నాలుగేళ్ల బాలికను పరీక్షల కోసం తీసుకొచ్చారని ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజీవ్ సాగర్ తెలిపారు. అయితే నాలుగు గంటలకే ఎమర్జెన్సీ సేవలను నిలిపివేయడంతో బాలికను డాక్టర్ బీఎస్ఏ ఆసుపత్రికి రెఫర్ చేసినట్టు తెలిపారు.
ఆ తర్వాత కాసేపటికి కొందరు వ్యక్తులు ఆసుపత్రిలోకి చొరబడి తొలుత చేరిన నిందితుడిపై దాడి చేశారని, ఆసుపత్రి సిబ్బందిపైనా దాడిచేశారని, దీంతో వారి బారి నుంచి తప్పించుకునేందుకు సిబ్బంది పరుగులు తీశారని పేర్కొన్నారు. అలాగే ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని రాజీవ్ సాగర్ తెలిపారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొన్నారు. వెంటనే ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగినట్టు తెలిపారు.