Hyderabad: ఈ అర్చన వలపు వలలో చిక్కారో... అంతే సంగతులు!
- ఎంబీఏ చదివిన నెల్లూరు యువతి అర్చన
- గొంతు మార్చి మాట్లాడుతూ మోసం
- బెయిల్ పై బయటకు రాగానే మళ్లీ అరెస్ట్
తెలుగు అమ్మాయిలను వివాహం చేసుకోవాలని భావిస్తూ, ఆన్ లైన్ లో ప్రొఫైల్స్ ఉంచే అబ్బాయిలే ఈ కిలేడీ టార్గెట్. ఎంబీఏ పూర్తి చేసి కూడా యువకులను మోసం చేయడమే వృత్తిగా పెట్టుకుని, గతంలో ఓ మారు జైలుకు వెళ్లి వచ్చి కూడా బుద్ధి మార్చుకోలేదు. తాజాగా ఆమె తన దందాను తిరిగి ప్రారంభించి, పలువురిని మోసం చేయడంతో రాచకొండ పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే, నెల్లూరు జిల్లా ఇనమడుగు ప్రాంతానికి చెందిన అర్చన ఎంబీఏ చదివింది. 2016లో ఓ కాలేజీ లెక్చరర్ ను పెళ్లి చేసుకుంది. అప్పటికే ఆమెకు జల్సాలు అలవాటుకాగా, డబ్బు కోసం మ్యాట్రిమోనీ మోసాలకు తెరలేపింది. గూగుల్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే అందమైన అమ్మాయిల బొమ్మలను తన ప్రొఫైల్ ఫొటోలుగా పెట్టేది. కేవలం ఫారిన్ అబ్బాయిలే కావాలంటూ షరతు పెట్టేది.
ఇక ఎవరైనా తనను సంప్రదిస్తే, యాప్స్ సాయంతో పలు రకాల గొంతులతో మాట్లాడుతూ, వధువు తల్లిదండ్రులమని నాటకమాడేది. ఎవరైనా యువకుడు లేదా వారి తల్లిదండ్రులు నమ్మి స్పందిస్తే, ఆపై తన దందాకు తెరలేపుతుంది. ఫొటోలు పంపించి, ఫోన్లలో మాట్లాడి, నిశ్చితార్థం రింగ్ తానే కొనుక్కుంటానని, బంగారు నగ బహుమతిగా కావాలని, మంచి చీరలు కావాలని వయ్యారాలుపోతూ లక్షల్లో డబ్బు దండుకుంటుంది. ఆపై వారికి విషయం తెలిసేలోపు ఫోన్ స్విచ్చాఫ్ చేస్తుంది.
ఇటీవల అమెరికాలో ఉంటున్న సింహాద్రి పవన్ కుమార్ అనే యువకుడికి పరిచయమైన అర్చన, పెళ్లి చేసుకునేందుకు సిద్ధమని చెప్పింది. తాను ఇల్లు మారాలని, అందుకు రూ. 4 లక్షలు కావాలని అడుగగా, పవన్, వెంటనే డబ్బు పంపించాడు. ఆ తరువాత అతని ఫోన్ నంబర్ ను ఆమె బ్లాక్ చేసింది. అనుమానం వచ్చిన పవన్ సూచన మేరకు హైదరాబాద్ లోని ఆయన సోదరుడు మధుమోహన్ పోలీసులను ఆశ్రయించగా, గతంలో తాము అరెస్ట్ చేసిన యువతే, ఇతన్ని కూడా మోసం చేసిందని పోలీసులు గుర్తించారు. పాత కేసులో మంగళవారం నాడు ఆమె బెయిల్ పై బయటకు రాగా, ఆ వెంటనే మరోసారి అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ అర్చన వలపు వలలో పడ్డవారు ఇంకా చాలామందే ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.