India: కోహ్లీ సేన పాకిస్థాన్‌ను భయపెట్టింది: పాక్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్
- కోహ్లీ సేనపై పాక్ మాజీ కెప్టెన్ ప్రశంసల వర్షం
- భారత జట్టు సమష్టిగా ఆడుతుంది
- పాక్ ఏ ఒక్కిరిపైనో ఆధారపడుతోంది.
ప్రపంచకప్‌లో పాక్‌పై భారత జట్టు ఘన విజయంపై పాక్ జట్టు మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ స్పందించాడు. ప్రస్తుత భారత జట్టు పాకిస్థాన్‌ను భయపెట్టిందన్నాడు. భారత్‌తో తలపడిన ప్రతిసారీ పాకిస్థాన్ జట్టు ఒత్తిడిలో కూరుకుపోతోందన్న వకార్.. తమది బలహీనమైన జట్టన్న భావనలో కూరుకుపోతోందన్నాడు. తొలుత దీని నుంచి సర్ఫరాజ్ సేన బయటపడాల్సి ఉంటుందన్నాడు. అలాగే పాక్ ఆటగాళ్ల ఫిట్నెస్ కూడా భారత ఆటగాళ్లతో సమానంగా పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. భారత జట్టు టీం స్పిరిట్‌కు మచ్చుతునక అని ప్రశంసించాడు. పాకిస్థాన్ జట్టు ఒక్కొక్క ఆటగాడిపైనా ఆధారపడుతుందని, కానీ భారత్ జట్టు ఏకమొత్తంగా ఆడుతుందని యూనిస్ పేర్కొన్నాడు.
గత కొన్నేళ్లుగా భారత్-పాక్ జట్ల మధ్య చాలా తేడా వచ్చిందని, ఆదివారం మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో అది కనిపించిందని వకార్ వివరించాడు. ఏ ఒక్క బౌలర్ పైనో, బ్యాట్స్‌మన్ పైనో పాక్ జట్టు ఆధారపడుతుందని, అదే సమయంలో భారత్ జట్టు సమష్టిగా ఆడుతోందని కితాబిచ్చాడు. భారత జట్టులో ఎవరి పాత్ర ఏమిటనేది ఆటగాళ్లకు తెలుసని అన్నాడు. బ్రహ్మాండంగా ఆడుతోందని, ప్రస్తుత జట్టు పాకిస్థాన్‌ను భయపెట్టిందని యూనిస్ పేర్కొన్నాడు.