Crime News: ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారన్న మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య
- ప్రైవేటు పాఠశాలలో చేర్చాలని కోరిన విద్యార్థి
- ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేక కాదన్న తల్లిదండ్రులు
- దీంతో క్షణికావేశంలో నిర్ణయం
స్నేహితులంతా ప్రైవేటు పాఠశాలలో చదువుతుంటే తాను మాత్రం ప్రభుత్వ పాఠశాలకు వెళుతుండడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. అమ్మానాన్నలు తన మాటకు విలువివ్వలేదని భావించిన విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని ఓ తండాకు చెందిన నిరుపేద దంపతులు బతుకు దెరువును వెతుక్కుంటూ కొన్నేళ్ల క్రితం తాండూరు వలస వచ్చారు. పట్టణంలోని అద్దె ఇంట్లో ఉంటూ రోజు కూలీ చేసుకుంటూ బతుకీడుస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు, కూతురు. పెద్ద కొడుకు ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. రెండో కొడుకు ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. రోజూ ఉదయం పూట పేపర్లు వేస్తూ కొంత సంపాదించి తల్లిదండ్రులకు చేదోడుగా ఉండేవాడు. తన స్నేహితులంతా ప్రైవేటు పాఠశాలల్లో చేరారని, తనను కూడా చేర్చాలని తల్లిదండ్రులను కోరాడు.
అయితే ఆర్థికంగా అంత స్తోమత లేదని వారు నిరాకరించారు. కొడుకు మనస్తాపానికి గురైతే సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ఆ బాలుడు ఇంట్లో తల్లి చీరతో ఉరివేసుకుని నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.