BJP: రాజకీయాలకు సుష్మా, సుమిత్రా మహాజన్ ఇక గుడ్ బై?
- మాజీ సభ్యులుగా గుర్తింపు కార్డుకు ఇటీవల దరఖాస్తు
- సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరం
- గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి వీరిద్దరి ఎన్నిక
భారతీయ జనతా పార్టీలో సీనియర్ మహిళా నాయకులు సుష్మా స్వరాజ్, సుమిత్రా మహాజన్ రాజకీయ జీవితం ముగిసినట్టేనా? అంటే, పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. 16వ లోక్‌సభలో సుష్మాస్వరాజ్ కేబినెట్ మంత్రిగా, సుమిత్రా మహాజన్ లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
గత ఎన్నికల్లో మధ్య ప్రదేశ్‌లోని విదిశ నుంచి సుష్మాస్వరాజ్, ఇండోర్ నుంచి సుమిత్రామహాజన్ గెలిచారు. ఒకరు అనారోగ్యం కారణంతో, మరొకరు వయోభారం పేరుతో ఈ ఇద్దరు మహిళా నేతలు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. తాజాగా ఇద్దరు నేతలు తమకు పార్లమెంటు మాజీ సభ్యులుగా గుర్తింపు కార్డు జారీ చేయాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నారు. అలాగే తనకు పార్లమెంటు సభ్యురాలిగా, స్పీకర్‌గా అవకాశం కల్పించినందుకు బీజేపీ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలంటూ ఇటీవల సుమిత్రా మహాజన్ ట్వీట్ కూడా చేశారు.
అలాగే త్వరలోనే ప్రధాని మోదీ, అమిత్‌షా, పలువురు కేంద్ర మంత్రులకు ఆమె విందు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆమె రాజకీయాల నుంచి దాదాపు తప్పుకున్నట్లే అని భావిస్తున్నారు. ఇక కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ను రాజ్యసభకు పంపిస్తారన్న మాట వినిపిస్తున్నా ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.