Telangana: కేసీఆర్! హరీశ్ రావు ఎక్కడ.. అసలు కనిపించడమే లేదు?: కె.లక్ష్మణ్
- పదవుల కోసం రాజీపడ్డ చరిత్ర కేసీఆర్ ది
- టీఆర్ఎస్ ఆఫీసుల కోసమే మంత్రిమండలి భేటీ
- హైదరాబాద్ లో మీడియాతో బీజేపీ నేత
గతంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పట్టించుకోలేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడ్డ ఆరు నెలల తర్వాత కేబినెట్ భేటీని ఏర్పాటుచేసి, ఎన్నికల హామీలపై కనీసం చర్చించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ది పదవుల కోసం రాజీపడిన చరిత్రేనని దుయ్యబట్టారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సహకారం అందలేదన్న కేసీఆర్ విమర్శలను లక్ష్మణ్ తిప్పికొట్టారు. కాళేశ్వరం కోసం కేంద్రం ఏమిచేసిందో, కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగిన హరీశ్ రావును అడగాలని సూచించారు. అన్నట్లు.. హరీశ్ రావు ప్రస్తుతం కనిపించడం లేదనీ, ఆయన ఏమయ్యారని ప్రశ్నించారు. కేవలం 30 జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ఏర్పాటు కోసమే కేసీఆర్ మంత్రివర్గ సమావేశం నిర్వహించారని ఎద్దేవా చేశారు.
కానీ బీజేపీ ఆఫీసులకు స్థలం కోరితే టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న శాసనసభను మార్చడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు అవసరం లేదని తేల్చిచెప్పారు.