narasaraopet: వైసీపీ ఎమ్మెల్యే అండదండలతోనే మాపై దాడి చేశారు: డాక్టర్ రమ్య
- ఎస్సీ కులం వారికి ఆసుప్రతి ఎందుకని కించపరిచారు
- ఎమ్మెల్యే గోపిరెడ్డి అండదండలతోనే దాడి జరిగింది
- సీఐ బిలాలుద్దీన్ కూడా వార్నింగ్ ఇచ్చారు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో పల్నాడు రోడ్డులో ఉన్న శ్రీ కార్తీక్ ఆసుపత్రిపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డ విషయం విదితమే. హాస్పిటల్ ను నిర్వహిస్తున్న డాక్టర్ దంపతులపై దాడి చేయడమే కాక... ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేశారు. మామ ఇవ్వాల్సిన క్రికెట్ బెట్టింగ్ డబ్బుల కోసం అల్లుడి ఆసుపత్రిపై ఈ దాడి జరిగింది. దాడి నేపథ్యంలో భయభ్రాంతులకు గురైన రోగులు, వారి బంధువులు బయటకు పరుగులు తీశారు.
ఈ సందర్భంగా డాక్టర్ రమ్య మాట్లాడుతూ, వైసీపీపై మండిపడ్డారు. ఎస్సీ కులం వారికి ఆసుపత్రి ఎందుకని తమను కించపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి ఓటు వేసినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకుంటామని అన్నారు. ఈ దాడి వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి అండదండలతోనే జరిగిందని చెప్పారు. ఆసుపత్రిని ఎలా నడుపుతారో చూస్తానంటూ సీఐ బిలాలుద్దీన్ కూడా వార్నింగ్ ఇచ్చారని అన్నారు.