tammareddy: ఎవరిని కామెంట్ చేస్తున్నామనేది తెలుసుకుంటే మంచిది: ట్రోలర్స్ కి తమ్మారెడ్డి భరద్వాజ హెచ్చరిక
- నేను యూట్యూబ్ లో ఉండేది తక్కువ
- సద్విమర్శలు స్వీకరించడానికి నేను రెడీ
- మీ నెగిటివిటీ మీ నాయకుడికే నష్టం
ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు సమకాలీన పరిస్థితుల పట్ల స్పందనను తెలియజేస్తుంటారు. తాజాగా తనని ట్రోల్ చేస్తున్నవారిని ఉద్దేశించి తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన స్పందించారు. "ఈ మధ్య కాలంలో 'జనసేన' నాయకుడు పవన్ కల్యాణ్ కి సంబంధించిన ఒక వీడియో పెడితే,''మీరు ఎంతసేపు యూ ట్యూబ్ లో కూర్చుని చెప్పడం కాదు .. బయటికి రండి'' అంటూ కొంతమంది కామెంట్లు పెట్టారు.
నేను ఓ సాధారణమైన వ్యక్తిగా బయటనే తిరుగుతుంటాను. నేను యూ ట్యూబ్ లో ఉండేది తక్కువ .. ప్రజల్లో వుండేదే ఎక్కువ. ఒక కామెంట్ చేసేటప్పుడు ఎవరిని గురించి .. ఏం కామెంట్ చేస్తున్నామనేది తెలుసుకుంటే సంతోషిస్తాను. ఏదో ఒక రకంగా ట్రోల్ చేయడమనేది కరెక్ట్ కాదు. సద్విమర్శలు స్వీకరించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే వుంటాను. మీ నెగిటివిటీ మీ నాయకుడికే నష్టం కలిగిస్తుందనే విషయం మరిచిపోకూడదు" అని చెప్పుకొచ్చారు.