Andhra Pradesh: ఏపీలో టీడీపీ నేతలకు భద్రత తొలగింపు, మరికొందరికి కుదింపుపై విమర్శలు
- కల్పన, జలీల్ ఖాన్ తదితరుల భద్రత తొలగింపు
- బుద్ధా వెంకన్న, వల్లభనేని వంశీల భద్రత కుదింపు
- ఈ నిర్ణయంపై బుద్ధా వెంకన్న అసహనం
ఏపీలో టీడీపీ నేతలకు భద్రత తొలగించడం, మరికొందరి భద్రతను కుదించడం అన్నది చర్చకు దారితీస్తోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భద్రతా సమీక్షా కమిటీ తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతలు ఉప్పులేటి కల్పన, జలీల్ ఖాన్, తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్, బోడె ప్రసాద్ లు ఎన్నికల్లో ఓటమిపాలైన అనంతరం వారికి ఉన్న వన్ ప్లస్ వన్ భద్రతను తొలగించారు.
అయితే, ఎన్నికల్లో గెలిచినప్పటికీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు ఉన్న భద్రతను సగానికి కుదించారు. మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రల భద్రతను వన్ ప్లస్ వన్ కు తగ్గించారు. భద్రతా కమిటీ ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలను రెండ్రోజుల నుంచి అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుద్ధా వెంకన్న స్పందిస్తూ, తనకు ఉన్న వ టూ ప్లస్ టూ భద్రతను వన్ ప్లస్ వన్ కు తగ్గించడంపై అసహనం వ్యక్తం చేశారు.