Andhra Pradesh: ‘మీ సీఎం మాట ఇస్తే వెనక్కి తగ్గరట కదా!’ అని పార్లమెంటులో ఎంపీలంతా అంటున్నారు: విజయసాయిరెడ్డి
- వీక్లీఆఫ్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు
- కొడుకు, కూతురును కోడెల బందిపోట్లుగా మార్చారు
- వీరి దోపిడీలో చంద్రబాబుకు కూడా వాటా ఉందేమో?
ఏపీ పోలీస్ శాఖలో వీక్లీఆఫ్ లు కల్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ లు అమలుచేసే విషయంలో సీఎం జగన్ మానవతను చాటుకున్నారని తెలిపారు. దేశంలోనే ఇటువంటి సాహసం చేసిన తొలి ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారనీ, తొలి రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించిందని వ్యాఖ్యానించారు.
పార్లమెంటు సెంట్రల్ హాల్ లో పలువురు సభ్యులు..‘మీ ముఖ్యమంత్రి మాట ఇస్తే వెనక్కు తగ్గరంట కదా’ అని తనతో అన్నారని విజయసాయిరెడ్డి కితాబిచ్చారు. కుమారుడు, కుమార్తెలను బందిపోట్లుగా మార్చిన కోడెల శివప్రసాదరావును పార్టీ నుంచి బహిష్కరించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. బలవంతపు వసూళ్లపై బాధితులు చంద్రబాబును కలిసి వేడుకున్నా పట్టించుకోలేదని అంటున్నారని, దీన్నిబట్టి చంద్రబాబుకు కూడా అందులో వాటా ఉందేమో? అని అనుమానం వస్తోందని అన్నారు.