relangi narasimharao: అప్పటి పద్ధతి వేరు .. ఇప్పటి పరిస్థితులు వేరు: దర్శకుడు రేలంగి నరసింహారావు
- అప్పట్లో ఉదయాన్నే షూటింగ్ మొదలయ్యేది
- ఇప్పుడు సాయంత్రం 6 వరకే చేస్తున్నారు
- సెట్లో చర్చలు ఎక్కువగా పెట్టేస్తున్నారు
తెలుగు తెరపై అనేక హాస్య చిత్రాలను .. కుటుంబ కథ చిత్రాలను ఆవిష్కరించిన దర్శకుడిగా రేలంగి నరసింహారావుకి మంచి పేరు వుంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చిత్రపరిశ్రమలో అప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పులను గురించి ప్రస్తావించారు.
"ఒకప్పుడు దాసరి నారాయణరావుగారు .. రాఘవేంద్రరావుగారు ఉదయం 7 గంటలకే ఫస్టు షాట్ తీసేవారు. బాగా పొద్దుపోయినా షూటింగు జరుగుతూనే ఉండేది. కానీ ఇప్పుడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే చేస్తున్నారు. ఒకప్పుడు మానిటర్ లేనప్పుడు దర్శకుడు ఓకే చెబితే ఓకే అంతే. కానీ ఇప్పుడు అంతా మానిటర్ చూసేసి అది అలా ఉందేంటి .. ఇది ఇలా ఉందేంటి? అంటూ మళ్లీ చేద్దామంటున్నారు. దాంతో షూటింగ్ ఆలస్యమైపోతోంది. ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో వుంది. అయినా సెట్లో డిస్కషన్స్ పెట్టి ఆలస్యం చేసేస్తున్నారు" అని చెప్పుకొచ్చారు.