Hyderabad: పోలీసులు నన్ను కొట్టిన అసలు వీడియోను బయటపెట్టాలి: ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్
- నేను రాయి పట్టుకున్న వీడియోను మాత్రమే బయట పెట్టారు
- ఫ్రీడమ్ ఫైటర్ రాణి అవంతి విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటి?
- పోలీసులు అకారణంగా నాపై దాడి చేశారు
హైదరాబాద్ లోని జుమ్మేరాత్ బజార్ లో గత రాత్రి జరిగిన ఘటనలో తన తలకు గాయమైందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఆరోపణలు అవాస్తవమని, తన తలను తానే రాయితో ఆయనే కొట్టుకున్నారంటూ పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ ను పోలీసులు విడుదల చేయడంపై రాజాసింగ్ స్పందించారు.
నిన్న రాత్రి జరిగిన ఘటనపై అసలు వీడియో ఏమైందో పోలీసులు చెప్పాలని, తనను పోలీసులు కొడుతున్న వీడియోను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాను రాయి పట్టుకున్న వీడియో క్లిప్ ను మాత్రమే పోలీసులు విడుదల చేశారు తప్ప, తనను పోలీసులు కొడుతున్న క్లిప్ ను మాత్రం బయటపెట్టలేదని అన్నారు. జుమ్మేరాత్ బజార్ లో ఫ్రీడమ్ ఫైటర్ రాణి అవంతి విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. పోలీసులు అకారణంగా తనపై దాడి చేశారని ఆరోపించారు.
ఎంఐఎం ప్రోద్బలంతోనే బీజేపీ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ బలపడుతుంటే టీఆర్ఎస్ కు భయం పట్టుకుందని, హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందన్న వార్తలు వాస్తవమేనంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.