Telugudesam: చంద్రబాబుతో చర్చిద్దాం, కష్టకాలంలో పార్టీని వీడడం సరికాదు: బండారు సత్యనారాయణమూర్తి
- ఎంపీల లేఖపై స్పందించిన టీడీపీ నేత
- నిర్ణయంపై పునరాలోచించుకోవాలని సూచన
- టీడీపీకి ఏదో అయిపోతుందనే భావన దురదృష్టకరమన్న బండారు
తెలుగుదేశం పార్టీలో భారీ సంక్షోభం నెలకొంది. టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్ రావు కొద్దిసేపటి క్రితమే తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి లేఖను అందించారు. దీనిపై, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తీవ్రంగా స్పందించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెళ్లిపోవడం సరికాదని హితవు పలికారు.
ఎంపీలు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని సూచించారు. ఒకవేళ బీజేపీతో మైత్రి కొనసాగిద్దాం అనుకుంటే ఆ విషయాన్నే పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చిద్దామని బండారు ప్రతిపాదించారు. టీడీపీకి ఏదో అయిపోతుందనే భావన నేతలు, కార్యకర్తల్లో కలగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.