TTD: వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమిస్తూ సీఎం జగన్ సంతకం
- ఈ ఉదయం ముఖ్యమంత్రి సంతకం
- ఈవోకు నియామకపు ఉత్తర్వులు
- రేపు ఉదయం 11 గంటలకు బాధ్యతల స్వీకరణ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా నియమిస్తూ, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఉదయం సంతకం చేశారు. ఆయన నియామకపు ఉత్తర్వులు కొద్దిసేపటి క్రితం వెలువడ్డాయి. నేడు కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరే ముందు వైవీకి కీలక పదవిని ఇస్తూ, జగన్ పత్రాలపై సంతకం చేశారు.
ఆ వెంటనే నియామకపు ఉత్తర్వులను టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ కు అధికారులు ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఆ పదవిలో కొనసాగుతున్న టీడీపీ నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్, రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, రేపు ఉదయం 11 గంటలకు శ్రీవారి సమక్షంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో నాలుగైదు రోజుల్లో పూర్తి స్థాయిలో పాలకమండలి ఏర్పడుతుందని, సభ్యులుగా ఎవరిని నియమించాలన్న విషయాన్ని జగన్ స్వయంగా పరిశీలిస్తున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి.