Iran: ఇరాన్ ఇంత పని చేస్తుందని కలలోనూ ఊహించలేదు: నిప్పులు చెరిగిన ట్రంప్
- అమెరికా డ్రోన్ ను కూల్చేసిన ఇరాన్
- కావాలనే చేశారంటున్న డొనాల్డ్ ట్రంప్
- సమస్యలు పెరుగుతాయని హెచ్చరిక
అమెరికాకు చెందిన మానవ రహిత నిఘా విమానాన్ని తాము కూల్చివేశామని, తమ ప్రాదేశిక జలాల గగనతలంలోకి ఆ విమానం వచ్చినందునే ఈ పని చేయాల్సి వచ్చిందని ఇరాన్ ప్రకటించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహోదగ్రుడయ్యారు. విమానం భాగాలను తాము రికవరీ చేశామని కూడా ఇరాన్ స్పష్టం చేయగా, ఆ దేశం చేసిన అతిపెద్ద తప్పు ఇదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇందుకు ప్రతిఫలాన్ని అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. ఇరాన్ కు బుద్ధి చెప్పేందుకు తమ దళాలు సిద్ధంగా ఉన్నాయంటూ, యుద్ధ హెచ్చరికలు పంపారు.
"ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసింది. ఆ సమయంలో మా విమానం అంతర్జాతీయ జలాల గగనతలంలోనే ఉంది. ఈ దేశం దీన్ని సహించబోదు. ఏం చేస్తామో చెబుతాను" అని అన్నారు. ఇది కావాలని చేసిందేనని తాను నమ్ముతున్నానని ఆయన అన్నారు. ఇది చాలా వెర్రి చర్యని, దీని కారణంగా ఇరాన్ కు సమస్యలు పెరగనున్నాయని అన్నారు. కాగా, ఇరాన్ పై ప్రతీకార చర్యలకు ట్రంప్ ప్రయత్నించవచ్చని తెలుస్తోంది.