BJP: టీడీపీ నుంచి త్వరలో మరికొన్ని వలసలు: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
- పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మా వైపు చూస్తున్నారు
- ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఇప్పుడు లేదు
- నారావారి పార్టీ పట్ల నాయకుల్లో అసంతృప్తి ఉంది
తెలుగుదేశం పార్టీ నుంచి త్వరలోనే బీజేపీలోకి మరిన్ని వలసలు ఉంటాయని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్ అన్నారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీజేపీవైపు చూస్తున్నారని తెలిపారు. పార్టీ విధివిధానాలు నచ్చే ఇతర పార్టీల నేతలు కమల దళంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారని, ఏపీలో కూడా బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవిస్తుందని జోస్యం చెప్పారు.
ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు లేదని, ఇప్పుడు నారావారి తెలుగుదేశం పార్టీయే మిగిలిందని ఘాటుగా విమర్శించారు. అధినాయకుని నిర్ణయాలు పార్టీలోనే చాలామందికి నచ్చడం లేదన్నారు. కాంగ్రెస్తో జత కట్టడాన్ని పార్టీ సీనియర్ నాయకుడు కె.ఈ.కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు వంటి వాళ్లకు ఏ మాత్రం ఇష్టం లేకున్నా, పార్టీ నిర్ణయం కాబట్టి నోరు మెదపలేకపోయారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే పేరు లేకపోయినా ఆ విధంగా రావాల్సిన ప్రయోజనాలన్నీ అందితీరుతాయని మాధవ్ చెప్పారు.