Galla Jaydev: పార్టీల విలీనాన్ని ఆమోదించే అధికారం రాజ్యసభ చైర్మన్ కు లేదు: గల్లా జయదేవ్
- పార్టీల విలీనం వ్యవస్థాపరమైన స్థాయిలోనే సాధ్యం
- బీజేపీలో టీడీపీ విలీనం చెందలేదు
- ట్వీట్ చేసిన గుంటూరు ఎంపీ
ఎవరూ ఊహించని విధంగా సుజనా చౌదరి, సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేశ్ టీడీపీని వీడడం, వెంటనే బీజేపీ కండువాలు ధరించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నలుగురు ఎంపీలు తమను ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి లేఖ ఇచ్చారు. దీనిపై టీడీపీ గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ స్పందించారు.
రెండు పార్టీల మధ్య విలీన ప్రక్రియకు ఆమోదముద్ర వేసే అధికారం రాజ్యసభ చైర్మన్ కు లేదని స్పష్టం చేశారు. రాజకీయ పక్షాల విలీనం అనేది వ్యవస్థాపరమైన స్థాయిలోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పెద్దల సభలో బీజేపీలో టీడీపీ విలీనం చెందిందన్నది వట్టిదేనని వివరించారు. షెడ్యూల్ 10, పేరా 4(2) అనేది అనర్హత, పార్టీల విలీనానంతర ప్రక్రియలకు సంబంధించింది మాత్రమేనని గల్లా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.