rajasekhar: కాపీ వివాదంలో 'కల్కి' సినిమా
- 'కల్కి' కథ నేను రాసుకున్నది
- చాలాకాలం క్రితమే రాజశేఖర్ కి చెప్పాను
- రైటర్స్ అసోసియేషన్లో ఫిర్యాదు చేశానన్న రచయిత కార్తికేయ
'గరుడ వేగ' హిట్ తరువాత రాజశేఖర్ కాస్త గ్యాప్ తీసుకుని 'కల్కి' సినిమా చేశాడు. ఆయన అభిమానులంతా ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కాపీ వివాదంలో చిక్కుకుంది.
కార్తికేయ అలియాస్ ప్రసాద్ అనే రచయిత ఈ కథ తనదేనని చెబుతున్నాడు. 'మహంకాళి' సినిమా సమయంలో నేను రాజశేఖర్ కి 'కల్కి' టైటిల్ తో కథ చెప్పాను .. స్క్రిప్ట్ కూడా ఇచ్చేశాను. ఈ ప్రాజెక్టుకి బడ్జెట్ ఎక్కువవుతుంది .. ఇప్పుడు అంత పెట్టలేం' అని రాజశేఖర్ అన్నారు. దాంతో నేను వేరే ప్రయత్నాల్లో ఉండిపోయాను. ఇప్పుడు అదే కథకి కొన్ని మార్పులు చేసి తీశారు. ఈ విషయంపై రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశాను. అసోసియేషన్ కమిటీ సభ్యులు 'కల్కి' యూనిట్ ను చర్చలకు పిలిస్తే రావడం లేదు. 'కల్కి' యూనిట్ నుంచి నేను డబ్బులు ఆశించడం లేదు .. క్రెడిట్ ఇస్తే చాలు" అని చెప్పుకొచ్చారు.