Telugudesam: పార్టీ బలోపేతం కోసమే కాపు నేతలు సమావేశమయ్యారు: ప్రత్తిపాటి
- స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు
- ఎంపీలు పార్టీ మారడాన్ని ఎవరూ హర్షించరు
- కార్యకర్తల్లో ధైర్యం నింపడానికే టెలీకాన్ఫరెన్స్
టీడీపీలో వరుసగా జరుగుతున్న పరిణామాలు నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యనేతలతో మాట్లాడనున్నారు. ఇప్పటికే టీడీపీ అగ్రనేతలు అమరావతిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఈ సమావేశానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తల్లో ఎలా ధైర్యం నింపాలన్న విషయాన్ని చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో చర్చిస్తారని తెలిపారు.
ఇక, నిన్న కాకినాడలో జరిగిన టీడీపీ కాపు నేతల సమావేశంపై ప్రత్తిపాటి వివరణ ఇచ్చారు. పార్టీ బలోపేతం కోసమే కాపునేతలు సమావేశం నిర్వహించారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలన్న అంశాన్ని వారు చర్చించారని వెల్లడించారు. అంతేగాకుండా, సీఎం రమేశ్, సుజనా తదితరులు పార్టీని వీడడంపైనా ప్రత్తిపాటి స్పందించారు. ఇలాంటి సమయంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీని వీడడాన్ని ఎవరూ హర్షించరని అన్నారు.