Sri Lanka: చచ్చీచెడీ 232 పరుగులు చేసిన శ్రీలంక!
- ఆదుకున్న మాథ్యూస్
- రాణించిన ఫెర్నాండో, మెండిస్
- చెరో మూడు వికెట్లు తీసిన ఆర్చర్, వుడ్
ఒకప్పటి శ్రీలంక జట్టుకు ఇప్పుడు ఆడుతున్న జట్టుకు ఎంతో తేడా ఉంది. జయవర్ధనే, సంగక్కర వంటి దిగ్గజాలు రిటైర్ అయ్యాక లంక జట్టు పతనం అంచుల్లోకి జారుకుంది. ఆటతీరు, ఫలితాలు చూస్తే నానాటికీ తీసికట్టు అన్నట్టుగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన లంకేయులు పడుతూ లేస్తూ ప్రస్థానం సాగిస్తున్నారు. ఇవాళ హెడింగ్లేలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న లీగ్ పోరులో అతికష్టమ్మీద 50 ఓవర్లు ఆడి 9 వికెట్లకు 232 పరుగులు చేశారు.
భీకర ఫామ్ లో ఉన్న ఇంగ్లాండ్ కు ఈ లక్ష్యం ఏమాత్రం సరిపోదన్నది క్రికెట్ పండితుల విశ్లేషణ. సగం ఓవర్లలోనే మ్యాచ్ ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మ్యాచ్ విషయానికొస్తే, ఏంజెలా మాథ్యూస్ 85 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో రాణించడంతో లంక ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ధనంజయ డిసిల్వ (29) నుంచి మాథ్యూస్ కు మంచి సహకారం అందింది. అంతకుముందు, ఫెర్నాండో 49, మెండిస్ 46 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్, వుడ్ చెరో 3 వికెట్లు తీయగా, అదిల్ రషీద్ 2 వికెట్లు సాధించాడు.