Andhra Pradesh: నాకు బెదిరింపులు రావడంపై డీజీపీకి ఫిర్యాదు చేస్తా: బుద్ధా వెంకన్న
- బెదిరింపు ఫోన్ కాల్ ఏ సమయంలో వచ్చిందో చెబుతా
- వాళ్లను పిలిచి విచారించాలని పోలీసులను కోరతా
- ఈ ఎంపీలను ప్రజలు, ప్రతి పార్టీ బహిష్కరించాలి
పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎంపీలకు వ్యతిరేకంగా మాట్లాడొద్దంటూ తనకు బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ద్వారా పార్టీ ఫిరాయించిన ఎంపీలు తనకు ఫోన్ చేసి బెదిరించారని ఆరోపించారు.
‘నాపై ఏ కేసులు వీళ్లు పెడతారో, ఎలా నన్ను లోపలేయిస్తారో వాళ్లను పిలిచి విచారించాలని’ పోలీసులను కోరతానని చెప్పారు. తనకు బెదిరింపు ఫోన్ కాల్ ఏ సమయంలో వచ్చిందో పోలీసులకు చెబుతానని అన్నారు. తాను పెద్దగా చదువుకోలేదని, మెస్సేజ్ లు పెట్టడం, చూడటం, రికార్డింగ్ చేయడం కూడా తనకు రాదని చెప్పారు.
ఈ బెదిరింపులకు భయపడి తాను పోలీసులకు ఫిర్యాదు చేయట్లేదని, తమ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా, వారికి అండగా ఉండడం కోసమే పోలీసులను ఆశ్రయించనున్నట్టు చెప్పారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఈ నలుగురు ఎంపీలు, చంద్రబాబే తమను వెళ్లమని చెప్పారనడం అబద్ధమని, దుర్మార్గమని అన్నారు. ఈ ఎంపీలను ప్రజలు, ప్రతి పార్టీ బహిష్కరించాలని అభిప్రాయపడ్డారు. ఈ ఎంపీలు ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు కాదని, పార్టీ ఎంపిక చేసిన వ్యక్తులని, పార్టీ గొడుగు కింద ఉండి పార్టీని మోసం చేశారని బుద్ధా వెంకన్న దుయ్యబట్టారు.