Telugudesam: ఈ నలుగురు అనైతిక ఎంపీలు బుద్ధా వెంకన్నను జైల్లో వేయిస్తారా!: వర్ల రామయ్య ఫైర్

  • సీఎం రమేశ్, సుజనాపై సీబీఐ దాడులు చేయలేదా?
  • భయంతో బీజేపీని శరణు జొచ్చారు
  • నైతికత ఉంటే ఎంపీ పదవులకు రాజీనామా చేయండి

పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ టీడీపీ ఎంపీలపై ధ్వజమెత్తిన తనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్టు ఎమ్మెల్సీ  బుద్ధా వెంకన్న ఆరోపించిన విషయం తెలిసిందే. బుద్ధా వెంకన్నకు ఈ బెదిరింపు ఫోన్ కాల్ రావడంపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నలుగురు అనైతిక ఎంపీలు బుద్ధా వెంకన్నను జైల్లో వేయిస్తారా? అని ప్రశ్నించారు.

 సీఎం రమేశ్ పై, సుజనా చౌదరిపై సీబీఐ దాడులు చేయలేదా? తనను అరెస్టు చేయొద్దంటూ సుజనా చౌదరి కోర్టుకు వెళ్లలేదా? అటువంటి సుజనా చౌదరి తనను సీబీఐ అరెస్టు చేస్తుందేమోనన్న భయంతో బీజేపీని శరణు జొచ్చారని విమర్శించారు. వీళ్లను రేపో మాపో అరెస్టు చేస్తారని జోస్యం చెప్పారు. రాజ్యసభ సభ్యులుగా టీడీపీ వారికిచ్చిన ఈ గౌరవాన్ని తమ పార్టీ వద్దే వదిలివేయాలని, కేవలం వ్యక్తులగానే బీజేపీలో చేరాలి తప్ప, టీడీపీ రాజ్యసభ సభ్యులుగా చేరేందుకు వీలులేదని రామయ్య నిప్పులు చెరిగారు.

 వారికి ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా ఆ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీపైనా ఆయన విరుచుకుపడ్డారు. నైతిక విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తామని చెబుతున్న బీజేపీ నాయకులు..  టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించి పార్టీలోకి ఎందుకు తీసుకోలేదు? ఇదేం విధానం? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News