Nagababu: రాజకీయ భవిష్యత్ కార్యాచరణ వెల్లడించిన నాగబాబు
- సొంత నియోజకవర్గంలో గడుపుతా
- నెలలో ఎక్కువరోజులు నరసాపురంలోనే ఉంటా
- ఇక జనసేనతోనే ప్రయాణం
మెగాబ్రదర్ నాగబాబు ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీచేసిన సంగతి తెలిసిందే. అయితే, లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పలేదు. దాంతో ఆయన రాజకీయాల్లో కొనసాగుతారా? లేక, సినిమాలు, టీవీ షోలతోనే సరిపెట్టుకుంటారా? అనే సందేహాలు కలిగాయి. వాటన్నింటికి నాగబాబు వివరణ ఇచ్చారు. తాను రాజకీయాల్లో కొనసాగుతానంటూ స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఇకమీదట నరసాపురం నియోజకవర్గంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
నెలలో ఎక్కువ రోజులు సొంత నియోజకవర్గంలో గడుపుతానని, ఇకపై తన ప్రయాణం పవన్ తో, జనసేనతోనే అని వివరించారు. "ప్రజలు మాకు ఓట్లేయలేదని వారిని తిట్టుకోవడం సరికాదు. ప్రజలు వైసీపీ కావాలని కోరుకున్నారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించడం అందరి విధి. ఓడిపోవడానికి వంద కారణాలు ఉండొచ్చు, గెలిచేందుకు అంతకుమించిన కారణాలు ఉంటాయి. మేం ఎందుకు ఓడిపోయామో సమీక్షిస్తున్నాం. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలన్నది మా ఆలోచన" అంటూ నాగబాబు ఓ లైవ్ స్ట్రీమింగ్ లో వెల్లడించారు.