annual budjet: రూ.2 లక్షల కోట్ల మార్కు బడ్జెట్...వృథా అరికట్టడం ప్రధాన ఎజెండా: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన
- మూడు వారాల్లోగా క్లారిటీ
- నిధుల వ్యయంలో సమతూకానికి పెద్దపీట
- నవరత్నాలకు అధిక ప్రాధాన్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయల మార్కును దాటే అవకాశం ఉందని, మూడు వారాల్లోగా బడ్జెట్‌పై క్లారిటీ ఇస్తామని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. దేశరాజధాని ఢిల్లీలో జీఎస్టీ మండలి 35వ సమావేశం అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
అన్నిరంగాలకు నిధుల వ్యయంలో సమతూకం పాటిస్తామని, నవరత్నాల అమలుకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేపట్టిన పలు అంశాలు కనుమరుగవుతాయని వివరించారు. ప్రభుత్వ ధనం వృథా, దుర్వినియోగం అరికట్టడం లక్ష్యంగా బడ్జెట్ రూపక్పనలో కార్యక్రమాలు పొందుపర్చనున్నట్లు వెల్లడించారు. పథకాల అమలుకు సరిపడా నిధులు సమీకరించుకుంటామని, కేంద్రం నుంచి రావాల్సిన సాయాన్ని రాబడతామని అన్నారు.
విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం, రావాల్సిన నిధుల గురించి ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు రాష్ట్రం చెల్లించే వాటాను భరించాలని కోరినట్లు వివరించారు. పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్‌ను చూశాక రాష్ట్ర ఆదాయ వనరులపై దృష్టిసారించనున్నట్లు తెలిపారు. ఆదాయ మార్గాలను ఇప్పటికే అన్వేషిస్తున్నట్లు చెప్పారు.