jagan: ఇంజనీరింగ్ నిపుణులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష సమావేశం ప్రారంభం
- ప్రాజెక్టుల పనులపై చర్చించే అవకాశం
- పలు ప్రాజెక్టుల అంచనాలపై ప్రభుత్వం అనుమానం
- నిర్థారణ అయితే రివర్స్ టెండరింగ్‌కు అవకాశం
ప్రాజెక్టుల పునఃసమీక్ష కోసం ఇంజనీరింగ్ నిపుణుల అభిప్రాయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈరోజు వారితో సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం ఈ భేటీ ప్రారంభమయ్యింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేపట్టిన పలు ప్రాజెక్టుల టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వం పలు ప్రాజెక్టుల పనులను పునఃసమీక్షించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇందుకోసం ఇంజనీరింగ్ నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. తాజాగా ఇంజనీరింగ్ నిపుణులతో జగన్ సమావేశమై ఆయా ప్రాజెక్టుల అంచనాలు, పనులు, పురోగతి తదితర అంశాలపై సమీక్షిస్తున్నారు. ప్రభుత్వం అనుమానిస్తున్నట్లు తప్పిదాలు జరిగినట్టు వెలుగు చూస్తే రివర్స్ టెండరింగ్‌కు అవకాశం ఉంది. ఈ సమావేశానికి జవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.