Andhra Pradesh: చంద్రబాబు ప్రజావేదికలో కాపురం ఉంటానని చెప్పడం లేదే?: టీడీపీ నేత రాజేంద్రప్రసాద్
- ఏపీ ప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తించింది
- మా నాయకుడు లేనప్పుడు సామాన్లు బయటపడేశారు
- ప్రజావేదిక ఇవ్వాలని లేఖ రాసినా స్పందించలేదు
అమరావతిలోని ప్రజావేదికలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన సామాన్లను బయట పడేయడంపై ఆ పార్టీ నేత రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో అన్యాయంగా, దారుణంగా ప్రవర్తించిందని ఆయన ఆరోపించారు. ‘సీఎం జగన్ కు లేఖ రాసినప్పటికీ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, మా నాయకుడు ఊర్లో లేనప్పుడు ప్రజావేదికను ఏకపక్షంగా ఆక్రమించుకుని సామాన్లను బయటపడేయడం అన్నది కక్షసాధింపు చర్య, ఇది రాక్షసత్వం.
ఓ 15 ఏళ్లు రాష్ట్రానికి సీఎంగా పనిచేసి ఈరోజు ప్రతిపక్ష నేతగా, కేబినెట్ హోదా ఉన్న చంద్రబాబుకు కూడా కనీస సౌకర్యాలు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు ఒక్కరికే పెద్ద బంగళా ఉండాలా? మరి చంద్రబాబు ఉండేందుకు చిన్న ఇల్లు, ప్రజలను కలవడానికి చిన్న ప్రజావేదిక పెట్టుకుంటే తప్పు ఏముంది? చంద్రబాబు ప్రజావేదికలో కాపురం ఉంటానని చెప్పడం లేదుగా’ అని చెప్పారు. ప్రజావేదికను తమకు కేటాయించాలని చంద్రబాబు లేఖ రాస్తే ఇప్పటివరకూ ఏపీ ప్రభుత్వం జవాబు చెప్పలేదని రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు.