central minister: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ పెద్ద మనసు.. అస్వస్థతకు లోనైన మహిళను తన కాన్వాయ్ లోని అంబులెన్సులో తరలించిన వైనం!
- అమేథీలో పర్యటిస్తున్న స్మృతీ ఇరానీ
- అనారోగ్యంతో బాధపడుతున్న యువతిని గుర్తించి సాయం
- చికిత్స వెంటనే ప్రారంభించాలని ఆసుపత్రి వర్గాలకు ఆదేశం
కేంద్ర మంత్రి, అమేథీ లోక్ సభ సభ్యురాలు స్మృతీ ఇరానీ తన పెద్దమనసును మరోసారి చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను స్వయంగా తన కాన్వాయ్ లోని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన యూపీలోని అమేథీలో ఈరోజు చోటుచేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ నుంచి గెలుపొందిన అనంతరం స్మృతీ ఇరానీ నియోజవకర్గంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో అనారోగ్యంతో ఇంటికే పరిమితమయిన ఓ యువతిని ఆమె గుర్తించారు.
తాము అంబులెన్సుకు ఫోన్ చేసినా ఇంతవరకూ వాహనం రాలేదని ఆమె కుటుంబ సభ్యులు మంత్రివద్ద వాపోయారు. వెంటనే స్పందించిన స్మృతీఇరానీ ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా తన కాన్వాయ్ లోని అంబులెన్సును బాధితురాలి ఇంటి దగ్గరకు రప్పించారు. అనంతరం ఆమెను సురక్షితంగా అంబులెన్సులోకి ఎక్కించి ఆసుపత్రికి పంపారు. ఆసుపత్రి వర్గాలతో ఫోన్ లో మాట్లాడి యువతికి తక్షణం చికిత్స ప్రారంభించాలని ఆదేశించారు. దీంతో కేంద్ర మంత్రి తీసుకున్న చొరవపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.