Andhra Pradesh: ప్రజావేదికను చంద్రబాబు తండ్రో.. తాతో కట్టలేదు.. ప్రభుత్వం ప్రజాధనంతో కట్టింది!: బొత్స సత్యనారాయణ
- బాబు ఇంటిపక్కన కార్యక్రమాలు చేయకూడదా?
- అసలు ఆయన ఉంటున్నదే ఓ అక్రమ కట్టడం
- పైపెచ్చు మా ప్రభుత్వాన్నే దబాయిస్తారా?
- టీడీపీ నేతలపై మండిపడ్డ ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి
ప్రజావేదిక నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన సామాన్లను అధికారులు బయట పడేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు అక్కడకు చేరుకుని వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేరుగా ప్రజావేదిక వద్దకు వచ్చేశారు. జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సదస్సుకు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజావేదిక మాది అని టీడీపీ నేతలు చెబుతున్నారు. మాది అని చెప్పడానికి ఇది చంద్రబాబు నాయుడు సొంత ఇల్లు ఏం కాదు కదా! ఆయన తండ్రిగారో, ఆయన తాతగారో, లేకపోతే చంద్రబాబు తన సంపాదనతో కట్టిన భవనం కాదు కదా.
ఇది ప్రభుత్వ ధనంతో కట్టిన ప్రభుత్వ బంగళా’ అని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఇంటి పక్కన ప్రభుత్వ కార్యకలాపాలు ఏవీ జరగకూడదా? అని బొత్స ప్రశ్నించారు. ఈ కార్యక్రమాల వల్ల చంద్రబాబు భద్రతకు ప్రమాదముంది అని ఆరోపించినా ఓ అర్థం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు చంద్రబాబు ఉంటున్న ఇల్లే అక్రమ కట్టడమనీ,అక్కడ ఆయన ఉండకూడదని స్పష్టం చేశారు. అక్రమ కట్టడంలో ఉండటమే కాకుండా పైపెచ్చు ప్రభుత్వాన్నే దబాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల కాలానికి ప్రజలు ఓటేస్తే రాష్ట్రం మొత్తం తనకు ధారాదత్తం చేసినట్లు చంద్రబాబు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.