Bihar: అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తూ వైద్యుడి అసభ్య ప్రవర్తన.. చావబాదిన యువతి బంధువులు
- బీహార్ లో ఘటన
- పోలీసుల రాకతో బతికిపోయిన డాక్టర్
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడానికి వచ్చిన ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడికి దేహశుద్ధి చేసిన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. భాగల్పూర్ లోని బిరజీ డయాగ్నొస్టిక్ కేంద్రంలో డాక్టర్ అనిల్ కుమార్ నేతృత్వంలో స్కానింగ్ లు నిర్వహిస్తుంటారు. 19 ఏళ్ల విద్యార్థిని కూడా స్కానింగ్ కోసం రాగా, ఆ అమ్మాయి తండ్రిని స్కానింగ్ రూంలోకి రానివ్వకుండా డాక్టర్ అనిల్ కుమార్ ఒక్కరే స్కానింగ్ రూంలోకి వెళ్లారు. కాసేపటికి ఆ విద్యార్థిని గట్టిగా అరవడంతో ఆమె తండ్రి స్కానింగ్ రూంలోకి వెళ్లారు.
ఆ సమయంలో, డాక్టర్ అనిల్ కుమార్ విద్యార్థిని చేతులు పట్టుకుని క్షమించమని ప్రాధేయపడుతున్నాడు. తండ్రి రాకతో ఆ అమ్మాయి వైద్యుడి నీచబుద్ధిని వెల్లడించింది. దాంతో ఆమె తండ్రి తన కుటుంబ సభ్యులను, స్థానికులను పిలిచి, డాక్టర్ అనిల్ కుమార్ పై దాడిచేశారు. ముఖం వాచిపోయేలా కొట్టారు. డయాగ్నొస్టిక్ సెంటర్ ను ధ్వంసం చేశారు. అక్కడున్న ఫర్నిచర్ ను చిందరవందర చేశారు. చివరికి పోలీసుల రాకతో డాక్టర్ అనిల్ కుమార్ బతికిపోయాడు. పోలీసులు అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.