Bihar: ఆసుపత్రి వెనుక పుర్రెలు, ఎముకలు... భయభ్రాంతులకు గురైన ప్రజలు!
- ముజఫర్ పూర్ లో దారుణం
- ఇప్పటికే మెదడువాపు వ్యాధి మృతులతో వార్తల్లోకెక్కిన శ్రీకృష్ణ ఆసుపత్రి
- మరోమారు అదే ఆసుపత్రిలో అస్థిపంజరాల కలకలం
బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ ప్రాంతంలో మెదడువాపు వ్యాధి కరాళనృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి బారినపడిన చిన్నారులకు ముజఫర్ పూర్ లోని శ్రీకృష్ణ మెడికల్ కాలేజి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వందమందికి పైగా చిన్నారులు చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఈ ఆసుపత్రి జాతీయస్థాయిలో వార్తల్లోకెక్కింది. అయితే, ఈ ఆసుపత్రి వెనుక భాగంలో పెద్ద సంఖ్యలో పుర్రెలు, ఎముకలు దర్శనమివ్వడం తీవ్రకలకలం రేపింది.
ముక్కలుగా మారిపోయిన మానవ అస్థిపంజరాలు ఈ స్థాయిలో బయటపడడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. వాటిలో కొన్ని సగం కాలినవి కాగా, మరికొన్ని పాక్షికంగా పూడ్చిపెట్టిన స్థితిలో దర్శనమిచ్చాయి. ఇవికాకుండా మరికొన్ని అస్థిపంజరాలు బస్తాల్లో కుక్కిన స్థితిలో కంటబడ్డాయి. దీనిపై ఆసుపత్రి వర్గాలు సరైన రీతిలో స్పందించలేదు. ఆసుపత్రి ఆవరణలో మనిషి పుర్రెలు, ఎముకలు ఎలా వచ్చాయన్న విషయం గురించి ఆసుపత్రి వైద్యులను ప్రశ్నించగా, ఈ వ్యవహారం తమకు సంబంధించింది కాదని తప్పించుకున్నారు. అయితే, అనాథ శవాలకు పోస్టుమార్టం చేసిన అనంతరం ఇలా పారవేసి ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి.