Chandrababu: ప్రజావేదికపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సీఆర్డీఏ
- ప్రజావేదిక నిర్మాణానికి రూ.7.50 కోట్లు
- గరిష్ట వరదమట్టం కంటే దిగువన ప్రజావేదిక ప్రాంతం
- నిర్మాణం సరికాదన్న అప్పటి జలవనరుల శాఖ సీఈ
ఉండవల్లిలోని ప్రజావేదిక భవనం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ భవనాన్ని తమకు కేటాయించాల్సిందిగా చంద్రబాబు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినా ఫలితం లేకపోగా, దాంట్లో ఉన్న టీడీపీ సామగ్రిని బయటపడవేసి ప్రభుత్వ వర్గాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఈ వ్యవహారంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది.
ఈ నేపథ్యంలో, ప్రజావేదికపై సీఆర్డీఏ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మితమైన ప్రజావేదిక నిర్మాణం కోసం రూ.7.50 కోట్లు ఖర్చుచేశారని పేర్కొంది. ప్రజావేదిక నిర్మించిన ప్రాంతం గరిష్ట వరదమట్టం కంటే దిగువన ఉందని, ఉండవల్లిలో ఆ నిర్మాణం సరికాదని అప్పటి జలవనరుల శాఖ సీఈ నివేదిక కూడా ఇచ్చారని సీఆర్డీఏ వివరించింది. నివేదికకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది.