India: పసి కూనలపై అతికష్టం మీద భారత్ విజయం!

  • ఈ వరల్డ్ కప్ లో ఓటమెరుగని భారత్
  • దాదాపు ఓడించినంత పని చేసిన ఆఫ్గన్
  • బౌలర్ల పుణ్యమాని 11 పరుగుల తేడాతో విజయం

ఈ వరల్డ్ కప్ లో ఓటమెరుగని భారత క్రికెట్ జట్టును, పసికూన ఆఫ్గనిస్తాన్ దాదాపు ఓడించినంత పనిచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టును ఆఫ్గన్ బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడిచేయగా, ఆపై ఆఫ్గన్ ఆటగాళ్లకు పగ్గం వేసేందుకు భారత్ శ్రమించాల్సి వచ్చింది. తాను ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ ఓడిపోయిన ఆఫ్గన్, ఇండియాపై తొలి విజయాన్ని సాధించేలానే కనిపించింది. అయితే, మిడిల్ ఓవర్లలో బుమ్రా, చివరిలో షమీ ఆఫ్గన్ ను దెబ్బతీసి, భారత్ కు పరాభవం ఎదురుకాకుండా తప్పించారు. ఇండియా కేవలం 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.  

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టులో కోహ్లీ (67 పరుగులు), కేదార్ జాదవ్ (52 పరుగులు) మాత్రమే రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇండియా 224 పరుగులు మాత్రమే చేసింది. ఆపై లక్ష్యాన్ని ఛేదించే పనిలో పడిన ఆఫ్గన్ ఆటగాళ్లలో మహ్మద్ నబీ, భారత్ కు ముచ్చెమటలు పట్టించారు. 55 బంతుల్లో 52 పరుగులు సాధించాడు.
అతనితో పాటు గుల్బాదిన్ 27 పరుగులతో, రహ్మత్ షా 36 పరుగులతో, హస్మతుల్లా 21 పరుగులతో తమవంతు సాయం చేయడంతో, 28 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు కేవలం 2 వికెట్లు కోల్పోయి 106 పరుగులు సాధించింది.

ఈ సమయంలో బుమ్రా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. అప్పటి నుంచి విజయం ఇరువైపులా దోబూచులాడింది. ఒక ఎండ్ లో నబీ పాతుకుపోగా, అతనికి సహకరించేందుకు జుద్రాన్ (21), రషీద్ (14) ప్రయత్నించినా, ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయారు. ఆఖరి ఓవర్ లో 16 పరుగులు చేయాల్సి వుండగా, షమీ హ్యాట్రిక్ సాధించడంతో విజయం భారత కైవసమైంది.

కాగా, 2010 తరువాత ఇండియా పూర్తి 50 ఓవర్లు ఆడిన క్రికెట్ మ్యాచ్ లలో ఇండియా చేసిన అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం 2010లో జింబాబ్వేపై 9 వికెట్లకు ఇండియా 194 పరుగులు సాధించింది.

  • Loading...

More Telugu News