Donald Trump: డొనాల్డ్ ట్రంప్ రేప్ చేశారంటూ రచయిత్రి ఆరోపణ... అంతలేదన్న ట్రంప్!
- తన స్నేహితురాలికి డ్రస్ కొన్నానని వచ్చిన ట్రంప్
- దాన్ని వేసుకుని చూపించాలని ఈజీన్ కరోల్ ను అడిగిన వైనం
- డ్రస్ వేసుకుంటుంటే అత్యాచారం
- సీసీ కెమెరాలు ఏమయ్యాయన్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి అత్యాచారా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన నిర్మాణ రంగంలో వ్యాపారిగా ఉన్న సమయంలో ఎంతో మందితో సంబధాలు నడిపారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో తనపై ఆయన అత్యాచారం చేశారని తాజాగా ప్రముఖ రచయిత్రి ఈజీన్ కరోల్ ఆరోపించారు. 1995 ప్రాంతంలో ట్రంప్ బలవంతంగా తనను అనుభవించారని ఆమె ఆరోపించడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. 'న్యూయార్క్ మ్యాగ్‌జైన్' కవర్ స్టోరీలో తన అనుభవాలను వెల్లడించిన ఆమె, మన్ హట్టన్ లోని బెర్గ్ డోర్ఫ్ డిపార్ట్ మెంట్ స్టోర్‌లో తనను ఆయన కలిశారని వెల్లడించారు. తన స్నేహితురాలికి ఓ గౌన్ కొనుగోలు చేశానని, అది ఆమె ధరిస్తే ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటున్నానని చెప్పిన ట్రంప్, దాన్ని ధరించాలని కోరారని, అందుకు అంగీకరించి, డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిన తనపై అత్యాచారం చేశారని ఆమె తెలిపారు.
కాగా, ఈజీన్ కరోల్ ఆరోపణలపై స్పందించిన ట్రంప్, తన జీవితంలో ఆమెను ఎప్పుడూ కలవలేదని అన్నారు. తాను రాసిన రచనల అమ్మకాలను పెంచుకోవడానికి ఓ కట్టు కథ అల్లి వదిలిందని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు పరిశీలించకుండా 'న్యూయార్క్ మ్యాగజైన్' ఇటువంటి కథనాన్ని ఎలా ప్రచురిస్తుందని ప్రశ్నించారు. అటువంటి స్టోర్ లో కెమెరాలు ఉండవా? అని అడిగారు. అమ్మకాలు జరిపించేందుకు సహాయకులు ఉంటారని, అసలు డ్రెస్సింగ్ రూమ్ లో రేప్ చేయడం ఎలా సాధ్యమని అడిగారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఇప్పటివరకూ దాదాపు 20 మంది మహిళలు ఆయనపై అత్యాచార అరోపణలు చేసిన సంగతి తెలిసిందే.