Uttar Pradesh: డ్యూటీ టైం అయిపోయిందని.. అపస్మారక స్థితిలో ఉన్న రోగిని బెడ్‌పైనే వదిలేసి ఆసుపత్రికి తాళం వేసి వెళ్లిపోయిన వైద్యులు!
- ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో ఘటన
- వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
- వైద్యాధికారి సహా నలుగురిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
డ్యూటీ సమయం ముగిసిపోవడంతో అపస్మారక స్థితిలో ఉన్న రోగిని బెడ్‌పైనే వదిలేసి ఆసుపత్రికి తాళాలు వేసి ఎంచక్కా వెళ్లిపోయారు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో జరిగిందీ ఘటన. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన సోనియా (30)ను కుటుంబ సభ్యులు ఫలోడా గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకొచ్చారు. బెడ్‌పై ఆమె అపస్మారకస్థితిలో ఉంగానే విధుల సమయం ముగిసిందంటూ వైద్యులు, సిబ్బంది వెళ్లిపోయారు.
కాసేపటి తర్వాత మెలకువ వచ్చిన సోనియా చుట్టూ పరిశీలించింది. ఆసుపత్రిలో ఎవరూ లేకపోవడంతో భయంతో బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. అయితే, బయట తాళం వేసి ఉండడంతో నిర్ఘాంతపోయింది. తనను రక్షించాలని తలపులు బాదుతూ రోదించింది. ఆమె అరుపులు విన్న స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి ఆమెన రక్షించారు. ఈ ఘటనపై స్థానికులు ఆందోళనకు దిగడంతో తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు గ్రూప్-డి ఉద్యోగులు, వైద్యాధికారి సహా నలుగురిని సస్పెండ్ చేశారు. అనంతరం ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.