Pakistan: దక్షిణాఫ్రికాపై విజయంతో విమర్శల నుంచి ఊరట పొందిన పాకిస్థాన్
- సఫారీలపై 49 పరుగుల తేడాతో విజయం
- రాణించిన రియాజ్, షాదాబ్
- లార్డ్స్ వేదికగా మ్యాచ్
చిరకాల ప్రత్యర్థి భారత్ పై ఓటమితో తీవ్ర విమర్శలపాలైన పాకిస్థాన్ ఎట్టకేలకు ఊరట పొందింది. ఆదివారం లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో 49 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 309 పరుగుల లక్ష్యఛేదనలో సఫారీలను 259/9 కే కట్టడి చేసింది. పాకిస్థాన్ బౌలర్లలో వహాబ్ రియాజ్, షాదాబ్ ఖాన్ అద్భుతమైన స్పెల్ తో ఆకట్టుకున్నారు.
పేసర్ వహాబ్ రియాజ్ చివర్లో పదునైన బంతులతో ముగ్గురు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ ను బౌల్డ్ చేయగా, స్పిన్నర్ షాదాబ్ ఖాన్ కీలకమైన వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ప్రధానభూమిక పోషించాడు. అమీర్ కు 2 వికెట్లు దక్కాయి. దక్షిణాఫ్రికా జట్టులో కెప్టెన్ డుప్లెసిస్ (63) దే అత్యధిక స్కోరు. ఫెహ్లుక్వాయో 46, డికాక్ 47, వాన్ డర్ డుస్సెన్ 36 పరుగులు చేశారు.
అంతకుముందు, టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. హరీస్ సొహైల్ 89, బాబర్ అజామ్ 69 పరుగులతో రాణించారు. తొలి వికెట్ కు ఓపెనర్లు ఇమాముల్ హక్ (44), ఫఖార్ జమాన్ (44) జోడీ 81 పరుగులు జోడించడంతో పాక్ భారీ స్కోరు దిశగా పయనించింది. మిడిలార్డర్ లో సొహైల్, అజామ్ కూడా కదంతొక్కడంతో పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది.
కాగా, ఈ ఓటమితో దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. సెమీస్ రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచ్ గెలవాలన్న స్థితిలో పాక్ తో మ్యాచ్ ఆడిన సఫారీలకు ఈ ఓటమితో అన్ని అవకాశాలు మూసుకుపోయాయి.